కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి
- సిర్పూర్(యు) బిఆర్ఎస్ నాయకులు
సిర్పూర్ యు, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం కొమురంభీం జిల్లా సిర్పూర్ యు మండల కేంద్రం లోని చౌరస్తా లో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యుటీ తహసిల్దార్ రాజా లింగుకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాటికి స్వస్తి పలికే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తొడసం భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగ్వంత్ రావ్, స్థానిక సర్పంచ్ ఆత్రం ఓం ప్రకాష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావ్, కొమురంభీం మనవడు కుంరం సోనేరావ్ బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






