ధాన్యం స్కాంలో బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి
టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జి మజీద్
సిరిసిల్ల, జూన్ 22,(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అక్రమాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఇందులో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) జిల్లా ఇంచార్జి మజీద్ డిమాండ్ చేశారు.సిరిసిల్ల ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.91 లక్షల అక్రమాల వ్యవహారం మాత్రమే కాకుండా, మొత్తం కుంభకోణం విలువ కోట్ల రూపాయల మేర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయిస్తారని, ప్రతి దశలో నమోదు, ధృవీకరణ, ఆన్లైన్ ప్రక్రియలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.ధాన్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రూ.14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.46.21 లక్షలను సీజ్ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంలో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థా యిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ అధినేత కవితక్క రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతుల సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కేసులో రాజకీయ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు లేదా మరెవరు ఉన్నా వారిని గుర్తించి శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మజీద్ డిమాండ్ చేశారు.సమావేశంలో కదిరే భాస్కర్, సయ్యద్ జావిద్, ఓర్సు అశోక్, బైరి రాజేష్, సయ్యద్ మౌలా, వేములవాడ నాయకులు తోట కనకయ్య, అంతర్పుల బాబు, వీర్నపల్లి మండల నాయకులు బండి శ్రీహరి, మండేపల్లి రవి పాల్గొన్నారు.






