‘మీ సేవ’ల్లో వసూళ్ల లీలలు!
- నిర్ణీత ఫీజు కంటే అధిక వసూళ్లు... నకిలీ పత్రాల సృష్టికర్తలు మీ సేవా..
- నిర్వాహకులు.. గుట్టుగా కొనసాగుతున్న నకి’లీలలు’..
- అమల్లోకి కొత్త చార్జీలు..ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా మీసేవ
- నిర్వాహకుల ఇష్టారాజ్యం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీ సేవలపై ఏసీబీ దాడులు జరిగేనా..?
బాన్సువాడ, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు ఏర్పాటుచేసిన మీ సేవ కేంద్రాలు దారి తప్పుతున్నాయి. వారికి విధించిన నిబంధనలు గాల్లో కలుస్తున్నాయి. ఎవరైతే మాకేంటి అన్న చందంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అడిగే వారు లేక.. అడ్డుకునే వారు కానరాక.. వీరి దందా మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నిరక్షరాస్యుల నుండి ధ్రువీకరణ పత్రాల కోసం నిర్ణీత ఫీజు కంటే అధికంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. భూములు ఇతరత్రా రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ల విషయంలో మీరు అడిగింది తడువుగా ఇచ్చుకుంటేనే పని పూర్తి చేసి పెట్టే పరిస్థితి ఏర్పడింది.
నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి ఏకంగా ధ్రువీకరణ పత్రాలను సృష్టించే సృష్టికర్తలుగా కూడా తయారయ్యారు. అధికారుల సంతకాలను సైతం ప్రోత్సహించేసే ధైర్యం కూడా వీరికి వచ్చింది. ఖాళీ ధ్రువీకరణ పత్రాలను చెంతన పెట్టుకొని సర్టిఫికెట్లను సైతం జారీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ నజర్ పెట్టింది. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో స్టాంప్ పేపర్లు నోటరీలు ముందుగానే సంతకాలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాలపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టి సామాన్య ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.
మీసేవ కేంద్రాలలో ’ఏసీబీ’ తనిఖీలు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ శాఖ అధికారులు దృష్టి సారించారు. మీసేవ కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీశారు. తద్వారా ఏసీబీ అధికారులు 13 మీసేవ కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల్ జిల్లాలోని మీసేవ కేంద్రాలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు మీసేవ కేంద్రాల నిర్వహకులు చేస్తున్న అవకతవకలు బయటపడ్డాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ పత్రాలు లభ్యమయ్యాయి.
వారి దృష్టికి వచ్చాయి. ముందుగా అధికారులు అల్వాల్ మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మీసేవ కేంద్రం పక్కనే ఉన్న జిరాక్స్ షాప్ లో కూడా అక్కడ ఖాళీ కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓ బి సి, ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లు సైతం లభించాయి. వీటితోపాటు నోటరీ స్టాంపులు ఉన్న కాళి పత్రాలను కూడా అధికారులు కనుగొన్నారు. వీటిలో తయారు చేసిన నకిలీ పత్రాలు కూడా లభ్యమయ్యాయి. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు మీసేవ కేంద్రం పై సి ఆర్. నం. 350/2026 కింద కేసు నమోదు చేశారు.
అసలు మీ సేవలు ఎందుకు పెట్టారంటే..
మీసేవ కేంద్రాల ద్వారా తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వ బిజినెస్ సేవలను వెంటనే వేగంగా అందించేందుకుగాను 2011 నవంబర్ 4వ తారీఖున అప్పటి ప్రభుత్వాలు మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా డిజిటల్ గవర్నెన్స్ విధానంలో భాగంగా ప్రభుత్వ సేవలను రాష్ట్ర ప్రజలకు చేరువలోకి తెచ్చే ఆలోచనతో ఏర్పాటు చేశారు. మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నుండి వచ్చే పథకాల దరఖాస్తుల తో పాటు, భూముల రిజిస్ట్రేషన్లు ఒకేచోట అందుబాటులో తెచ్చేందుకు ఆన్లైన్ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో మీసేవ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ సేవలు ఏది కావాలన్నా కార్యాలయాలకు వెళ్లకుండా మీసేవ కేంద్రాలకు వెళ్లే అవకాశం కల్పించారు.
ఈ కేంద్రాల్లో వందలాది జి2సి( గవర్నమెంట్ సిటిజన్ ), జి 2 బి ( గవర్నమెంట్ బిజినెస్) సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్రధానంగా కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, జనన,మరణ ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు వంటి సేవలు సామాన్యులు దరఖాస్తులు చేసుకునే విధంగా ఆన్లైన్ విధానాన్ని రూపొందించారు. వీటితోపాటు రెవిన్యూ మరియు భూమి సేవలు, అడంగల్, పహాని సేవలు పొందే అవకాశం కల్పించారు. అలాగే ఈ పాస్ బుక్ దరఖాస్తు, భూమి మార్పిడి దరఖాస్తు, తాసిల్దార్, ఆర్డిఓ సర్టిఫైడ్ కాపీలతో పాటుగా పోలీస్ శాఖ చలాన్లు, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పనులతో పాటు రవాణా శాఖ సేవలను కూడా పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా మీసేవ కేంద్రాల్లో పాన్ కార్డు, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఆధార్ కార్డుల అప్డేట్లు చేసుకునే వెసలు బాటు సైతం కల్పించడం జరిగింది.
అధిక వసూలు..
వివిధ ప్రభుత్వ సేవలు నిమిత్తం ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు మీ సేవ కేంద్రలకు వెళ్లే సామాన్యుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే కొన్ని మీసేవ కేంద్రాల నిర్వహకులు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నిరక్షరాస్యులనుండి అయితే ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీసేవ కేంద్రాల గురించి తెలిసిన వారితో మాత్రం ప్రభుత్వ నిర్ణయించిన చార్జీలనే తీసుకుంటున్నట్లు సమాచారం. వేగంగా ధ్రువీకరణ పత్రాలు కావాలని వచ్చేవారి నుండి తాము తొందరగా సర్టిఫికెట్లను అందిస్తామని చెబుతూ అధిక చార్జీలను పుచ్చుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా భూముల మార్పిడి విషయంలో రైతుల నుండి ఇ స్టారీతిన వసూలు చేస్తున్నట్లు సమాచారం.
మీసేవ కేంద్రాల నిర్వహకులు సామాన్యుల సమాచారాన్ని హరితగతిగా ఆన్లైన్లో పొందపరచేందుకుగాను కాసులను దండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అక్కడక్కడ నకిలీ ధ్రువపత్రాలను కూడా సృష్టించేందుకు మీ సేవ కేంద్రాల నిర్వహకులు సాహసిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పుడు సమాచారాన్ని పొందపరిచి అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాలను మంజూరు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మీసేవ కేంద్రాలపై పర్యవేక్షణ ఉండే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వీరి వ్యవహారం అడ్డు అదుపు లేకుండా పోయిందన్న వదంతులు ఉన్నాయి. అధికారులు తరచు మీసేవ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ కార్యాలయాల కే పరిమితం కావడంతో మీ సేవ కేంద్రాల నిర్వహణ దారి తప్పుతుందని వాదన తెరపైకి వస్తుంది. అధికారులు స్పందిస్తే తప్ప సామాన్యులపై అధిక భారం పడే అవకాశం ఉండదని పట్టణ ప్రముఖులు పేర్కొంటున్నారు.
మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు
తెలంగాణలో మీసేవ కేంద్రాల్లో సర్వీసు ధరలను పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80 పెంచారు. అలాగే జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62 లుగా నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన చార్జీలతో సామాన్యులపై ధరాఘాతం పడనుంది. మిషన్ లో ప్రభుత్వం పునర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.






