17 August, 2026 | 6:57 PM

సోంపల్లికి ముంపు ముప్పు

17-08-2026 06:06 PM

పోలవరం ముంపు జాబితాలో చేర్చాలని గ్రామస్థుల వినతి

బూర్గంపాడు, (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంతో పాటు కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌ కారణంగా సోంపల్లి గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాన్ని పోలవరం ముంపు ప్రాంతాల జాబితాలో చేర్చి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

కిన్నెరసాని బ్యాక్‌వాటర్‌తో పాటు ఇతర వాగులు, వరదల ప్రభావానికి సోంపల్లి ప్రాంతం గురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. బూర్గంపాడుకు కరకట్ట నిర్మించినప్పటికీ బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో గ్రామంలోని ఇళ్లు, వ్యవసాయ భూములకు ముంపు ముప్పు ఉందన్నారు.

ఇప్పటికే కిన్నెరసాని వరదల కారణంగా పలువురు రైతుల భూములు కోతకు గురయ్యాయని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భద్రాద్రి ప్రాంతంలో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున సోంపల్లిపై వరద, బ్యాక్‌వాటర్‌ ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు గ్రామస్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.గ్రామాన్ని పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపు నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం చూపాలని ఎంపీడీవో జమలారెడ్డిని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.