మహా మాయ..!
- మైనింగ్ భూమిలో ప్రైవేట్ రైలు కూత
- పర్యావరణ, మైనింగ్ శాఖ కళ్లు కప్పి రైల్వే లైన్ నిర్మాణం
- సున్నపురాయి పేరిట ప్రభుత్వ భూమి లీజు
- పర్యావరణ నిబంధనలకు తూట్లు
- మైనింగ్ లీజు ముసుగులో సర్వే నంబర్ 874లో భూ దందా
- మేళ్లచెరువులో మైహోమ్ సిమెంట్స్ రైల్వే లైన్ నిర్మాణానికి నో పర్మిషన్.. నో టాక్స్
- మహా మత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) :* ఏదైనా పరిశ్రమలకు అనుమతులు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. అయితే కొన్ని పరిశ్రమలు అనుమతులు వచ్చిన తర్వాత ఆ నిబంధనలకు నీళ్ళొదులుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కేవలం లాభాల కోసం నడుపుతుంటారు. సరిగ్గా ఇదే విధానం నేడు జిల్లాలోని మేళ్లచెరువులో మైహోమ్ (మహా) సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది.
పర్యావరణ, మైనింగ్ నిబంధనల మేరకే తమ సంస్థ పనిచేస్తుందని చెప్పుకునే యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవికంగా సున్నపురాయి మైనింగ్ కోసం ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకొన్న మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ ఏకంగా మైనింగ్ లీజు భూమిలో ప్రైవేట్ రైల్వే లైన్ నిర్మించుకుందనేధి స్థానికులందరూ చర్చించుకుంటున్న మాట. ఇంతటితోనే ఆగకుండా మైనింగ్ లీజు భూమిని కబ్జా చేసి భారీ నిర్మాణాలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి.
అక్రమంగా క్రయ, విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికుల ద్వారానే తెలుస్తుంది .చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మిన చందంగా మైహోం సిమెంట్ సంస్థ పేరు చెప్పి కొందరు భూకబ్జాదారులు మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు భూమిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనీ కొందరు స్థానికుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మైనింగ్ భూమిలో నిబంధనలకు మించి సెంటు భూమి కబ్జా చేసిన చర్యలు దిగుతున్న ప్రభుత్వాలు మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ యాజమాన్యం ఏకంగా ప్రైవేట్ రైల్వే లైన్ నిర్మించినా అడ్డుకోకపోగా భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మైనింగ్ కోసం అనుమతులు:
మేళ్లచెరువు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 874లో 567 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలోనే 30ఎకరాల్లో తాసిల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఎంపిడిఓ ఆఫీస్, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ సహా ఎస్సీ కాలనీ ఇండ్లు ఉన్నాయి. ఇదే సర్వే నెంబర్ గల భూమిలో 141.644 హెక్టార్ల భూమిని సున్నపురాయి మైనింగ్ కోసం మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు 1983లో ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అప్పటి దేవి సిమెంట్స్ పర్యావరణ అనుమతులు తీసుకొని కేంద్ర ప్రభుత్వ అనుమతుల మేరకు మైనింగ్ కార్యకలాపాలు మాత్రమే నిర్వహిస్తుంది. ఇటీవల 2023లో మైహోమ్ సిమెంట్స్ పర్యావరణ అనుమతులను రెన్యువల్ చేసుకుంది. షరతులతో కూడిన అనుమతులను పర్యావరణ శాఖ జారీ చేసింది.
పర్యావరణ అనుమతులకు తూట్లు! :
కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు శాఖ జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా మైహోం సిమెంట్స్ పరిశ్రమ మైనింగ్ భూమిలో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టిందనేధి అందరికి కనిపిస్తున్న విషయమే. మైనింగ్ లీజు అగ్రిమెంట్ ప్రకారం భూమిని మైనింగ్ కోసమే వినియోగించాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు, ఇతర కార్యకలాపాలు చేపట్టరాదు. ఒకవేళ ఏమైనా నిర్మాణాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టినా ఖచ్చితంగా పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మైహోమ్ సిమెంట్ పరిశ్రమ పర్యావరణ , మైనింగ్ శాఖ కల్లుగప్పి ఏకంగా ప్రైవేట్ రైల్వే ట్రాక్ నిర్మించుకుందనేది స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్న విమర్శ.
2009లో ఈ మైనింగ్ భూమిని అనుకొని ప్రభుత్వం రైల్వేలైన్ నిర్మించింది. ప్రభుత్వం నిర్మించిన రైల్వేలైన్ కింద మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ భూమి కొంతమేర కోల్పోయింది. మైహోమ్ సిమెంట్స్ సైతం మైనింగ్ భూమిలో ఏకంగా తమ అవసరార్థం రైల్వే లైన్ నిర్మించింది. ఇది కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పరచారనేది ప్రధాన అభియోగం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పత్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం మాత్రమే మైనింగ్ నిర్వహించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా మైహోమ్ సిమెంట్స్ వ్యవహరిస్తుందనీ కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
రైల్వే ట్రాక్ నిర్మాణానికి నో పర్మిషన్ , నో టాక్స్:
మై హోమ్ సిమెంట్స్ తమ కంపెనీ అవసరార్థం రైల్వే ట్రాక్ నిర్మించుకోవాల్సి వస్తే తన సొంత భూమిలో నిర్మించుకోవాల్సి ఉన్న నిబంధనలకు విరుద్ధంగా సున్నపురాయి మైనింగ్ కోసం కేటాయించిన భూమిలో పర్యావరణాన్ని అనుమతులకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ నిర్మించిందనీ ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఈ మైనింగ్ భూమి కాకుండా సర్వేనెంబర్ 1057లోని పట్టా భూముల్లో రైల్వే ట్రాక్, లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ నిర్మించినప్పటికీ కనీసం గ్రామపంచాయతీ నుండి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదనేధి కొందరు స్థానికుల వాదన. .2015లో నిర్మించిన ఈ రైల్వే లోడింగ్ పాయింట్ కి ఇప్పటివరకు కనీసం ఇటువంటి పన్నులు కూడా చెల్లించలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఈ రైల్వే ట్రాక్, లోడింగ్ పాయింట్ 12 హెక్టార్లలో మైహోమ్ సిమెంట్ నిర్మించగా, రైల్వే ట్రాక్ కోసం 6 హెక్టార్ల మైనింగ్ లీజు భూమిని వాడుకున్నట్లు తెలిసింది.
పట్టించుకోని ప్రభుత్వాలు:
ఆరు నెలలకు ఒకసారి సున్నపురాయి మైనింగ్ కోసం మైహోమ్ సిమెంట్స్ పర్యావరణ అనుమతులు కొనసాగిస్తుండగా, అదేవిధంగా ఎప్పటికప్పుడు మైనింగ్ కార్యకలాపాలపై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కలు కడుతున్నప్పటికీ మైనింగ్ భూమిలో మైహోమ్ సిమెంట్ నిర్మించిన రైల్వేట్రాక్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బహిరంగంగా పర్యావరణ అనుమతులకు ఉల్లంఘించినప్పటికీ పర్యావరణ శాఖ ఇటువైపున కన్నెత్తి చూడదంలేదు అని పలువురు విమర్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కన్నుసన్నల్లో నడిచే సున్నపురాయి మైనింగ్ పై మిన్ను కుండటం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణపై విచారణ జరిపి మైహోం సంస్థ పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి..
మేళ్లచెరువు మైన్స్1ద్వారా మై హోమ్ సి మెంట్ సంస్థ కు 141 హెక్టా ర్లు సున్నపురాయి మైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా మైహోం సంస్థ మైనింగ్ భూమిలో రైల్వే ట్రాక్ నిర్మించింది. వెంటనే పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి మైహోం సంస్థ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
కమతం నాగార్జున, స్థానిక న్యాయవాది






