calender_icon.png 9 February, 2026 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు

09-02-2026 02:25:39 AM

  1. కంపాసాగర్‌కు చెందిన దంపతుల గల్లంతు
  2. భార్య మృతదేహం లభ్యం..
  3. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్  
  4. నల్లగొండ జిల్లా ముకుందాపురం సమీపంలో ఘటన

సూర్యాపేట (నల్లగొండ), ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కారులో ప్రయాణిస్తున్న దంపతులు మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. కారు అదుపుతప్పి సాగర్ కాల్వలో దూసుకెళ్లడంతో ఇద్దరు గల్లంతయ్యారు. భార్య మృతిచెందగా.. భర్త కోసం కాల్వలో గాలిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగింది.

నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన దంపతులు తల్లం పుల్లయ్య(63), తల్లం పద్మ(55)గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో, చిన్న కుమారుడు శివ మిర్యాలగూడలో ఉంటున్నారు. నెల రోజుల క్రితం దంపతులు బైక్‌పై మిర్యాలగూడ వెళ్లి వస్తుండగా తుంగపహాడ్ వద్ద ఓ కారు ఢీ కొట్టింది. దీంతో పద్మ వెన్నెముకకు గాయాలు కావడంతో కొద్దిరోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నది.

అనంతరం మిర్యాలగూడలో చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వీరు కంపాసాగర్‌లోని ఇంటికి వెళ్తామని కొడుకు శివకు చెప్పగా తన సొంత కారులో డ్రైవర్‌ను ఇచ్చి పంపాడు. ఇంటికి వెళ్తున్న క్రమంలో నిడమనూరు మండలం ముకుందాపురం వద్దకు వెళ్లగానే కారు డ్రైవర్ రసూల్ కాలు చెప్పును సరి చేసుకుంటున్న క్రమంలో కాలు యాక్సిలేటర్‌కు తగిలి కారు వేగం పెరిగింది.

దీంతో అదుపుతప్పి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకుపోయి బోల్తా పడింది. రసూల్ అద్దం తెరుచుకుని బయటికి వచ్చి కేకలు వేయగా సమీపంలో ఉన్న వ్యక్తులు కొబ్బరిమట్ట అందించగా ఆది పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. నీటి ప్రవాహ దాటికి తట్టుకోలేక కారులో చిక్కుకుపోయిన దంపతులు గల్లంతయ్యారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, గజ ఈతగాళ్ళు, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రమాద స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం పద్మ మృతదేహం లభ్యమైంది. అలాగే కారును బయటికి తీశారు. పుల్లయ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు.