15 August, 2026 | 9:51 AM

ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా శ్వేత

15-08-2026 09:07 AM

ఎంపీడీఓ సుస్మిత చేతుల మీదుగా అవార్డు అందజేత

లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సాటివారిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. శ్వేత ఉత్తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి అవార్డును కైవసం చేసుకున్నారు. గ్రామాభివృద్ధిలో విశేష ప్రతిభ కనబరిచినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) సుస్మిత చేతుల మీదుగా గ్రామ కార్యదర్శి పి. శ్వేత శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం ఎంపీడీఓ సుస్మిత, గ్రామ సర్పంచ్ వజ్జ విజయభాస్కర్ లు   సాటివారిగూడెం గ్రామ  పంచాయతీ అధికారి శ్వేతను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వజ్జ విజయభాస్కర్ మాట్లాడుతూ... గ్రామ కార్యదర్శి శ్వేత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఆమె అంకితభావం, సమర్థవంతమైన పనితీరు వల్లే ఈ రోజు తమ గ్రామానికి ఈ గొప్ప గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మంగ శివాని కూడా గ్రామ పురోగతికి నిజాయితీతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అధికారుల సమిష్టిగా కృషి, పాలకవర్గం సహకారంతోనే సాటివారిగూడెం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉత్తమ అవార్డును సొంతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.