కీచక ఉపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు
* గురువే గుండెల్లో... గుబులు పుట్టించాడు?
* విద్యార్థినుల ఆరోపణలపై వెలుగులోకి వచ్చిన వ్యవహారం
* తెలుగు ఉపాధ్యాయుడు ఎం. నర్సింలుపై ఉన్నతాధికారుల చర్యలు
* విజయక్రాంతి ఎఫెక్ట్
పాపన్నపేట: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువుపైనే విద్యార్థినులు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఎం. నర్సింలు విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఇటీవల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విజయక్రాంతి దినపత్రికలో సోమవారం "ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు" అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత ఉపాధ్యాయుడిపై చర్యలు చేపట్టి సస్పెన్షన్ వేటు వేసారు.
చర్చనీయాంశంగా మారిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్ వేటు
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ, పత్రికలో శీర్షిక వెలువడడంతో తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలును సస్పెండ్ చేసారు. దీంతో పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానిజాలు తేల్చాల్సిందే..
విద్యార్థినులు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. విద్యార్థినుల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గురువు అంటే మార్గనిర్దేశకుడు.. అలాంటి గురువుపైనే ఆరోపణలు రావడం విద్యా వ్యవస్థకు ఆందోళనకర పరిణామంగా మారింది. అధికారులు చేపట్టిన విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.






