3 July, 2026 | 1:31 AM

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపమా..?

03-07-2026 12:35 AM

బడులకు చేరని ఏకరూప దుస్తులు.. 

బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని ఏకరూప దుస్తులు..

మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే 937 బాలురకు, 983 బాలికలకు అందని ఏకరూప దుస్తులు

ఎర్రుపాలెం జూలై 2 (విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు బడులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు ఏకరూప దుస్తులు అందించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తమ ప్రభుత్వం విద్యార్థుల ఆశయాలను నెరవేర్చాలని పనిచేస్తూ విద్యార్థిని విద్యార్థులకు అనేక సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ అవి ఆచరణలో సాధ్య పడటం లేదు.

అందరూ చదవాలి, అందరికీ విద్య అందరూ ఎదగాలి, నిర్బంధ ప్రాథమిక విద్య అమలులో ఉన్నప్పటికీ అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి. మండల వ్యాప్తంగా జూన్ నెలలో బడులు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏకరుపదుస్తులు అందించాల్సి ఉంది. మండలంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 446 బాలురు ఉండగా, బాలికలు 491 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 490 బాలురకు, 493 బాలికలకు ఇంతవరకు ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందించలేదు. దీనితో మండలంలోని విద్యను అభశిస్తున్న పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులపై భారం కానున్నది.మండలానికి చేరుకొని ఏకరూప దుస్తులుకు సంబంధించిన క్లాత్ ఇంతవరకు రాలేదు. క్లాత్ వచ్చిన తర్వాత మండల సమైక్య సభ్యులకు అప్పగించి విద్యార్థులకు సంబంధించిన కొలతలను తీసుకొని టైలరింగ్ ద్వారా కుట్టి విద్యార్థులకు అందించ వలసి ఉంటుంది.

సమయానికి క్లాత్ రాకపోవడం వల్ల విద్యార్థులకు అందించేందుకు మరింత ఆలస్యం పట్టే సమయం ఉంది. దీనివల్ల విద్యార్థులు తమ చదువులకు మరింత దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల ఏకరూప దిస్తులను అందించాలని మండల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.