11 May, 2026 | 3:40 AM

తరగు పేరిట వరి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

11-05-2026 12:19 AM

శ్రీరంగాపూర్, మే 10: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనుండి మిల్లులకు చేరుకున్న ధాన్యం వాహనాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అన్ లోడింగ్ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్ శ్రీరంగాపూర్ మండలం, శేరిపల్లి గ్రామంలోని సప్తగిరి రైస్ మిల్ను అకస్మికంగా తనిఖీ చేశారు.

ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అధికారులకు మరియు మిల్లు యాజమాన్యానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.మిల్లుకు చేరుకున్న ధాన్యం వాహనాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అన్ లోడింగ్ చేయాలని  అదనపు కలెక్టర్ ఆదేశించారు. రైతులు మిల్లుల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం అన్ లోడింగ్ సమయంలో కిలోల రూపంలో ఎటువంటి తరుగు తీయకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైస్ మిల్కు నియమించబడిన స్పెషల్ ఆఫీసర్, లారీల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

ఏ లారీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఖాళీ అయ్యింది అనే వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. లోడింగ్ మరియు అన్ లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రతి రైస్ మిల్కు గ్రామ పంచాయతీ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వీరు మిల్లు వద్ద ఉండి ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూస్తారని పేర్కొన్నారు. రైతులు ఆష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేసినా, వాహనాలను నిలిపివేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.