23 April, 2026 | 2:56 AM

ఆరుగురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

23-04-2026 01:44 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఏడీజీపీలు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావుకు డీజీ హోదా కల్పించారు. 1996 బ్యాచ్‌కు చెందిన  చారు సిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్‌లకు కూడా ప్రభుత్వం డీజీ వోదాను కల్పించింది.

మహేష్ భగవత్ ప్రస్తు తం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీగా ఉండగా, స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్నారు. వీవీ శ్రీనివాసరావు తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్‌గా వ్యవహారిస్తుండగా, సీఐడీ, మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు.

అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉండగా, వీసీ సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు డీజీ హోదాల్లో అదే స్థానాల్లో సేవలు అందించనున్నారు.