18 June, 2026 | 7:16 PM

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఇఓకు వినతి పత్రం

18-06-2026 05:30 PM

దమ్మపేట, జూన్ 18(విజయ క్రాంతి): మధ్యాహ్నం భోజనం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం పదివేల రూపాయలు వేతనం పెంచి అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల మెనూ చార్జీలు 25 రూపాయలకు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ జగపతికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ వంట కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో గత 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కనీస వేతనాలు ఇవ్వటం లేదని అన్నారు.

ఇప్పటి మెనూ ను పాఠశాలలో విద్యార్థులకు వండి పెట్టాలంటే పెరిగిన ధరలతో సాధ్యపడదని అన్నారు. వంట గ్యాస్ కు మధ్యాహ్నం భోజనం పథకంలో బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం వలన గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో వంటలు ఎలా చేస్తారని అన్నారు. వంట గ్యాస్ కు, కోడిగుడ్లకు ప్రభుత్వమే పాఠశాలలకు నేరుగా సరఫరా చేయాలని రాజకీయ ఒత్తిళ్లకు లోను కా పాతవారిని తొలగించకూడదని, వంట కార్మికులకు గుర్తింపు కార్డులు, రెండు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు , మధ్యాహ్న భోజన వర్కర్ సీనియర్ మండల అధ్యక్షురాలు సత్యవతి, కార్యదర్శి శ్రీదేవి, రోజా, జయలక్ష్మి, సుగుణ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.