1 June, 2026 | 9:22 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపించండి

01-06-2026 07:54 PM

ప్రజల ఆరోగ్య జీవన భద్రతలకు రక్షణ కల్పించండి

డంపింగ్ యార్డ్ సమస్యపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం

ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కార్మిక సంఘ నేతలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల ఆరోగ్య జీవన భద్రతలకు తగిన రక్షణ కల్పించాలని డంపింగ్ యార్డ్ సమస్యపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రజా కార్మిక సంఘాల నేతలు తెలిపారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ కీసర యాప్రాల్ కాప్రా ఘట్కేసర్ తదితర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న రాంకీ చెత్త డంపింగ్ యార్డ్ కు శాశ్వత శాస్త్రీయ పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేస్తూ మూడు కార్మిక సంఘాలకు చెందిన ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి టీయుసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రవీణ్ రాష్ట్ర అధ్యక్షులు వై మల్లేష్ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జవహర్ నగర్ కీసర సర్కిల్ పరిధిలోని రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ డంపింగ్ యార్డ్ సుమారు 390 ఎకరాల్లో విస్తరించి ఉందని 2009లో జిహెచ్ఎంసితో ఒప్పందం చేసుకునేటప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో వ్యర్ధాలను తరలించాలని నిబంధన ఉండేదని గుర్తు చేశారు. కానీ గ్రేటర్ తో పాటు శివారు ప్రాంతాల నుండి కూడా చెత్తను తరలించడం వలన 390 ఎకరాలలో  95% చెత్తతో నిండిపోయిందని అన్నారు. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతంగా తయారైందని పేర్కొన్నారు.

డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల లక్షలాదిమంది ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వారితోపాటు వివిధ ప్రాంతాల నుండి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ప్రజలు గాలి భూమి నీరు కాలుష్యంతో తల్లడిల్లుతున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే దుర్వాసన వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు పుట్టే పిల్లలు అంగవైకల్యం రకరకాల చెప్పుకోలేని చర్మవ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల కిందట జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు జవహర్ నగర్ ప్రాంతాల ప్రజలతోపాటు వివిధ ప్రాంత ప్రజల ప్రజానికం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

అప్పటి ప్రభుత్వం ప్రజా ఆందోళనకు దిగి వచ్చి యార్డ్ నుండి వెలువడే దుర్వాసనలు అరికట్టడానికి క్యాపింగ్, లాంటి కొన్ని చర్యలు చేపట్టిందని నేడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలనం చేసి హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా చేసి సమస్యను మరింత పెద్దగా మార్చిందని తెలిపారు. సమస్య పరిష్కారం కొరకు నగరానికి నాలుగు వైపుల నుండి కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయంలో భాగంగా ఖానాపూర్ లోని తలకొండపల్లి, రంగారెడ్డి జిల్లాలోని 42 ఎకరాలు, లకడారంలోని పటాన్చెరువు సంగారెడ్డిలో 100 ఎకరాలు, దుండిగల్లోని 85 ఎకరాలు మల్కాపూర్ లోని చౌటుప్పల్ యాదాద్రిలో 200 ఎకరాలు కేటాయించారు.

కానీ అక్కడ ప్రజల ప్రజా వ్యతిరేకత ప్రతినిధులు అడ్డుకోవడంతో భూమి బదలాయింపు ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిబద్ధతను చిత్తశుద్ధిని చాటుకొని ప్రజల విశ్వాసాన్ని చూర కొనాలని గుర్తు చేశారు. లేనియెడల ఈ సమస్యపై జవహర్ నగర్ ప్రాంతంలో కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలతో త్వరలోనే డంపింగ్ యార్డ్ సమస్యపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రజా కార్మిక సంఘాల నేతలు తెలిపారు. జవహర్ నగర్ దమ్మాయిగూడ కీసర యాప్రాల్ కాప్రా ఘట్కేసర్ తదితర ప్రాంతాల జీవన ప్రమాణాలను వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న రాంకీ చెత్త ర్యాంకింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నిర్వహించే డంపింగ్ యార్డ్ బాధిత ప్రజా  పరిరక్షణకు జరిగే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని షేక్షావలి, ప్రవీణ్, వై మల్లేశులు ఈ సందర్భంగా తెలిపారు