గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఆలేరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆలేరు మండలం శర్భనాపురంలో నిర్వహించిన ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ సభలో వారు మాట్లాడారు. ముందుగా గీత కార్మికుల ఉద్యమంలో అమరులైన సూదగాని ఎట్టయ్య, బండి బాలరాజు, కోటగిరి మల్లయ్య, సీస బాలరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గీత కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రతి కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచాలు అందించాలని కోరారు. గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, నందనంలో ఏర్పాటు చేసిన నీరా ప్రాజెక్టును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా, మండల నాయకులు, గీత కార్మికులు, బస్ యాత్ర బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






