కేంద్రం కుట్ర భగ్నం, ప్రతిపక్షాల విజయం: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దేశ సమాఖ్య స్వరూపాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra) శనివారం ఆరోపించారు. మహిళా కోటా చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ప్రతిపక్షాల ఐక్యతకు లభించిన విజయమని ప్రియాంకా గాంధీ ఉద్ఘాటించారు. మీడియా సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, మహిళల రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 'మహిళల రిజర్వేషన్ల చట్టం-2023'ను(Women's Reservation Bill) అమలు చేయదలిస్తే, దానికి తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఏకైక ఉద్దేశం శాశ్వతంగా అధికారంలో కొనసాగడమేనని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ దురుద్దేశాలను దేశ ప్రజలు గ్రహించగలరని పేర్కొన్నారు.






