ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లా పరిధిలోని చిన్న గూడూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. మార్చి 14 తేదీ నుండి జిల్లాలోని 45 పరీక్షా కేంద్రాల ద్వారా 8,157 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ సూచనల ప్రకారం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ప్రతీ కేంద్రానికి ఒక్కటి, 528 పరీక్షల నిర్వహణ సిబ్బంది, 45 వైద్య బృందాల సిబ్బంది, అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, నిత్య పర్యవేక్షణలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చీఫ్ సూపర్డెంట్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల ఓపెనింగ్, క్లోజింగ్ ప్రక్రియ, విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుండి వైర్లెస్ సెట్ ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులను, హాజరు వివరాలను, స్టాకును తనిఖీ చేశారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ వారికి అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న శ్యామ్, మ్యామ్, పిల్లలను గమనిస్తూ ఉండాలని, బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, పిల్లల హాజరు శాతం పూర్తిస్థాయిలో ఉండాలన్నారు.




