20 July, 2026 | 8:54 PM

Breaking News

నీళ్లెత్తి పోయండి!

20-07-2026 02:33 AM
  1. కేసీఆర్‌ను తిట్టిపోయటం కాదు 
  2. గోదావరి జలాలను ఎత్తిపోస్తేనే పొలాలు తడుస్తాయి 
  3. కరువుకు నీళ్లే పరిష్కారం.. విమర్శలు కాదు: మాజీమంత్రి హరీశ్ 
  4. చిన్నకోడూరు రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం

సిద్దిపేట, జూలై 19 (విజయక్రాంతి): కేసీఆర్‌ను తిట్టిపోస్తే నీళ్లు రావని, గోదావరి జలాలను ఎత్తిపోస్తేనే రైతుల పొలా లు తడుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు గోదావరి జలాలను ఎత్తిపో యాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండల రైతులు ఆదివారం నిర్వహించిన మహా పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు.

15 కిలో మీటర్ల మేర సాగిన పాదయాత్రలో వేలాది మంది రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహా పాదయాత్ర బీఆర్‌ఎస్ కార్యక్రమం కాదని.. రంగ నాయకసాగర్, అనంతగిరి రిజర్వాయర్ల ఆయకట్టు రైతులే స్వచ్ఛందంగా నిర్వహించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టంలో నీటి కరువు, ఎరువుల కొరత, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందని ఆరోపించారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి రంగనాయకసాగర్ సహా రిజర్వాయర్లను నింపడంతో రైతులకు రెండు పంటలకు నీరు అందిందన్నారు. రైతులు ఫోన్ చేస్తే కాలువ గేట్లు తెరిచి సాగునీరు విడుదల చేసిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.ప్రస్తుతం కాళేశ్వరం పంపులను ప్రారంభించకుండా గోదావరి జలాలను దిగువకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మేలు జరగాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ విమర్శలను పక్కనపెట్టి సాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని కోరారు. 

రైతుల కోసం దేనికైనా సిద్ధం

రైతుల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయకపోతే రైతుల ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని హెచ్చరించారు. చిన్నకోడూరు పాదయాత్రతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, ఇతర మండలాలకు కూడా వ్యాప్తి చెందుతుందన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా అమలు హామీలను ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదన్నారు.

ఎరువుల కొరత, విద్యుత్ అంతరాయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. యూరియా యాప్‌లు ప్రవేశపెట్టడం కంటే రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచి తే రైతులకు సౌకర్యంగా ఉంటుందని హరీశ్‌రావు సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలకు తావివ్వకుండా, శాస్త్రీయంగా అందుబాటులో ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరవు నుంచి రైతులను కాపాడాలనే లక్ష్యంతోనే ఈ పోరాటం మొదలైందని స్పష్టం చేశారు.