పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి
అశ్వాపురం, ఆగస్టు 22(విజయ క్రాంతి): పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అశ్వాపురంలో విలేకరులతో మాట్లాడుతూ..పాలిటెక్నిక్ విద్యను మరో విభాగంలో విలీనం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జీవో 97పై పునరాలోచించాలని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని సులక్షణ గోపిరెడ్డి స్పష్టం చేశారు.






