21-02-2026 02:59:27 PM
ఆమనగల్లు,(విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్(Amangal Municipal Elections) ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని పార్టీ లీడర్లు, కేడర్ జీర్ణించుకోలేకపోతున్నది. 15 వార్డులకు గాను కేవలం ఒక్కస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి రావడం విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలే గోతులు తవ్వుకున్న రాజకీయ ఆత్మహత్యాసదృశ్యం అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జ్‌గా వ్యవహరించిన పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ లో ని 15 వార్డుల అభ్యర్థులను ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాల్సింది పోయి, కనీసం తన పార్టీ అభ్యర్థుల మధ్య సమన్వయం కూడా చేయలేకపోవడం గమనార్హం. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నారు.
అసమ్మతి చిచ్చు
ఆమనగల్లు మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపు నుండే అసలు కథ మొదలైంది. 9వ వార్డు రగడే అసలు కారణంగా చెప్పవచ్చు. దీనిచుట్టే అసలు కథ నడిచింది. ఇదే అన్ని సీట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రభావం పడింది. ఇక్కడ సీనియర్ నేత చెన్నారెడ్డి, మరోనేత గుర్రం కేశవులు మధ్య తారాస్థాయికి చేరిన వివాదాన్ని పరిష్కరించడంలో నాయకత్వం తడబడింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జోక్యం చేసుకున్నా మనస్పర్థలు తొలగలేదు. జంగారెడ్డిపల్లి, సంకటోనిపల్లి వార్డులో ఇదే పంచాయతీ. ఇక్కడ కూడా సీనియర్ నేత ఖాదర్ వంటి వారు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎమ్మెల్యే భరోసా ఇచ్చినా, ఇన్ చార్జ్ స్థాయిలో వారిని కలుపుకుని ప్రచారం చేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కోవర్టుల బెడదను పసిగట్టిన వారితో పార్టీ నేతల అంతర్గత ఒప్పందాల కారణంగా వారిని మందలించలేకపోయారు.మెజారిటీ వార్డుల్లో ‘రెబల్స్’ కంటే ప్రత్యర్థులతో చేతులు కలిపిన కోవర్టుల బెడద పార్టీని నిలువునా ముంచేసింది.
విపక్షాల ‘ఆపరేషన్ ఆకర్ష్’
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ స్పీడ్ పెంచితే కాంగ్రెస్ వ్యవహారం మాత్రం నత్తనడకలా సాగింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ రాష్ట్రనేత టి.ఆచారి, బీఆర్ఎస్ నుంచి రజిని సాయిచంద్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉప్పల్ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వంటి నేతలు గ్రౌండ్ లెవల్‌లో పని మొదలుపెట్టారు. పట్టణంలో పట్టున్న కీలక నేతలను తమ గూటికి చేర్చుకున్నారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో కొత్త చేరికలపై దృష్టిపెట్టలేదు. బలమైన నేతలు పార్టీలోకి వస్తామన్నా, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సరైన స్పందన చూపలేదనే విమర్శలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కు పార్టీ ముఖ్యనేతలు సలహాలు, సూచనలు ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఉన్న ఓటు బ్యాంకు గాలిలో కలిసిపోయింది.
రంగంలోకి ఎమ్మెల్యే కసిరెడ్డి
ఎన్నికలు ముగిసి వారం గడిచినా కనీసం రివ్యూ మీటింగ్ లేకపోవడంపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రంగంలోకి దిగారు. వార్డుల వారీగా లోతైన నివేదికను తెప్పించుకుంటున్న ఆయన ఓటమికి గల కారణాలను ఆరాతీస్తున్నారు. ‘పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాం, కానీ నాయకుల మధ్య సమన్వయం లేక, లోపాయికారీ ఒప్పందాల వల్ల ఓడిపోయాం. ఇంత జరిగినా బాధ్యులు కనీసం స్పందించకపోవడం దారుణమని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ముందున్న సవాళ్లు
ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపిన కోవర్టులను గుర్తించి వెంటనే సస్పెండ్ చేయడం. క్షేత్రస్థాయిలో పట్టు లేని, సమన్వయం చేయలేని ఇన్ చార్జీలపై చర్యలు తీసుకోవడం, ఘోర పరాభవంతో నైతికంగా దెబ్బతిన్న కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం నింపడం వంటి చేయాలని లీడర్లు, కేడర్ లేదంటే భవిష్యత్ లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ పరాజయానికి ఇన్ చార్జ్ బాధ్యత వహిస్తారా? లేక మౌనంగానే కాలం గడిపేస్తారా? అన్నది వేచిచూడాలి.