NTR పాలన, ప్రజా సంక్షేమం ఆదర్శం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు 103వ జయంతి(NTR Birth Anniversary) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఆయనకు నివాళులర్పించారు. ఎన్టీఆర్(NTR)ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కొనియాడారు. NTR పాలన, ప్రజా సంక్షేమం ఆదర్శం అన్నారు. సినీరంగానికి NTR చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని మోదీ తెలిపారు.
ఎన్.టి. రామారావు(N.T. Rama Rao) మే 28, 1923న జన్మించి, జనవరి 18, 1996న తన 72వ ఏట కన్నుమూశారు. NTR 1982లో తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party) స్థాపించి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా(Chief Minister of Andhra Pradesh) మూడు పర్యాయాలు సేవలందించారు. ఆయన సుమారు 300 చిత్రాలలో నటించి, తెలుగు సినిమా రంగంలో అగ్రతారగా ఎదిగారు. ప్రస్తుతం టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. 16 మంది లోక్‌సభ సభ్యులతో, కేంద్రంలోని NDA కూటమిలో టీడీపీ ఒక కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
''మహనీయులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, వారికి నా హృదయపూర్వక నివాళులు. పేద, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించడమే లక్ష్యంగా, ప్రజా సంక్షేమం పట్ల, సుపరిపాలన పట్ల ఆయన కనబరిచిన అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో ఒక శాశ్వత స్ఫూర్తిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. నా మిత్రులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని NDA ప్రభుత్వం ప్రజల కోసం ఆయన కన్న కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.'' అని పీఎం మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.






