డిప్యూటేషన్ల పేరుతో.. పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!?
ఇబ్బందులు తొలగించాలని మంత్రి సీతక్కకు వేడుకోలు
మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఉన్నఫలంగా పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ల పేరుతో ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయడంతో పంచాయతీ కార్యదర్శుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 400కు పైగా గ్రామపంచాయతీ కార్యదర్శులను ఇటీవల ముకుమ్మడిగా బదిలీ చేశారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా పంచాయతీ కార్యదర్శుల హోదాలను బట్టి కొత్తగా పంచాయతీలకు డిప్యూ టేషన్లు ఇచ్చి బదిలీ చేశారు. సొంత మం డలం, సొంత నియోజకవర్గ పరిధిలో కాకుం డా ఇతర మండలాలు, నియోజకవర్గాల పరిధిలోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
పంచాయతీ కార్యదర్శుల్లో నాలుగు కేటగిరిలు ఉండగా, ఆయా కేటగిరీల వారీగా, స్థాయిని బట్టి పంచాయతీలకు డిప్యూటేషన్లతో బదిలీలు చేసినట్లు చెబుతున్నప్పటికీ, పలుచోట్ల పంచాయతీ కార్యద ర్శుల బదిలీల్లో ఆ విధానాన్ని పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు కేసముద్రం మండలానికి చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించిన తర్వాత 2019లో ఇదే మండలం లోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు చేపట్టి ఏడేళ్లు దాటుతున్నప్పటికీ అతనికి ఇటీవల నిర్వహించిన డిప్యూటేషన్ బదిలీల్లో మహబూబాబాద్ నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గానికి బదిలీ చేయాల్సి ఉండగా, అలా చేయకుండా ఇదే మండలంలో మరో గ్రామానికి బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఇక ఇదే మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని అనేక పర్యాయాలు అధికారుల నుంచి తాఖీదులు అందుకున్నప్పటికీ, అతన్ని కూడా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఓ మేజర్ పంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేయడంతో బదిలీలు సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇక నాలుగు కేటగిరీలు గా విభజించిన పంచాయతీ కార్యదర్శుల మూల వేతనాన్ని పరిగణలోకి తీసుకొని డిప్యూటేషన్ బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటేషన్ పేరుతో బదిలీ చేయడం వల్ల అక్కడ ఎన్ని రోజులు విధులు నిర్వహిస్తామో స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడడంతో పంచాయతీ కార్యదర్శులు తాము పనిచేసే చోటకు పెట్టేబేడా సర్దుకొని వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
సాధారణ బదిలీ అయితే మూడు నుండి ఆరేళ్ల పాటు బదిలీ అయిన స్థానంలో స్థిరంగా విధులు నిర్వహించే పరిస్థితి ఉంటుందని, ఇప్పుడు డిప్యూటీషన్ల పేరుతో చేసిన బదిలీల్లో తరచుగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సుదూర ప్రాంతాలకు తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్యదర్శులను బదిలీ చేయడం వల్ల ఇప్పుడు నివాసం ఉంటున్న ప్రదేశాల నుండి వచ్చి వెళ్లడానికే జీతం మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటేషన్లు ఇచ్చేటప్పుడు కనీసం తమకు పరస్పర అంగీకార బదిలీకి అవకాశం ఇచ్చి ఉంటే కొంత ఇబ్బంది లేకుండా పోయేదని పలువురు కార్యదర్శులు చెబుతున్నారు. డిప్యూటీషన్ల పేరుతో బదిలీలు చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, 40 శాతానికి మించి కార్యదర్శులను బదిలీ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుందని, అయితే అందుకు విరుద్ధంగా 100 శాతం పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ల పేరుతో బదిలీ చేశారంటూ గురువారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి పంచాయతీ కార్యదర్శులు తీసుకువెళ్లారు.
పలువురు పంచాయతీ కార్యదర్శుల పోస్టింగ్ చేంజ్?
మహబూబాబాద్ జిల్లాలో 400 పైగా పంచాయతీ కార్యదర్శులను ఇటీవల పేరుతో బదిలీ చేయగా, కొందరు మళ్ళీ తమ ‘పలుకుబడి’ని ఉపయోగించి కోరుకున్న చోటికి బదిలీ చేయించుకొని, విధుల్లో చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేసిన ప్రదేశానికి వెంటనే వెళ్లి జాయిన్ కావాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయగా, జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు తమకు కేటాయించిన పంచాయతీలో విధుల్లో చేరినప్పటికీ, కొందరు మళ్ళీ తమ బదిలీ స్థానాలను మార్చుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం వల్ల జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల డిప్యూటీషన్ల బదిలీ ప్రక్రియ విమర్శల పాలవుతోంది.




