ధాన్యం కొనుగోళ్లలో రూ.141 కోట్ల చెల్లింపు
ములుగు (మహబూబాబాద్) మే 28 (విజయక్రాంతి): ములుగు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల నుండి 76,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, ఇందులో 9 వేల మందికి పైగా రైతులకు ఇప్పటివరకు 141 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేసినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు తెలిపారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను, సంబంధిత శాఖల అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, రైతులకు ఇలాంటి సందేహాలు , సమస్యలు తలెత్తితే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 9347416178 లో అధికారులను సంప్రదించాలని కోరారు.
అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని బిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, వర్షం వస్తే దాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు చెప్పారు. అనుకోని పరిస్థితులు ఏర్పడి ఒకవేళ వర్షానికి ధాన్యం తడిస్తే నిబంధనల ప్రకారం, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ప్రకటించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.






