ఒక్క కిలోమీటర్ కోసం 12 గ్రామాల ఆశలు ఆగవు
– కాలువ పూర్తి చేస్తాం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పెద్దలింగాపూర్ సహా 12 గ్రామాల రైతులు సాగునీటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో కాలువ పనులు ఒక్క కిలోమీటర్నర దూరంలో నిలిచిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11/6లో భాగంగా జరుగుతున్న ఈ పనులు పూర్తి కాకపోవడంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన తీన్మార్ మల్లన్న పెద్దలింగాపూర్ గ్రామాన్ని సందర్శించి నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించారు. రైతులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను విన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... “రైతుల సాగునీటి హక్కు ఎవరూ కాలరాయలేరు. కాలువ పనులు పూర్తి అయ్యే వరకు నేను పక్కనే ఉంటాను. రైతులకు నీరందించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు. వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే సహించబోమని అధికారులను హెచ్చరించిన మల్లన్న, త్వరలోనే మిగిలిన ఒక్క కిలోమీటర్నర పనులు పూర్తయ్యి సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మల్లన్న ఇచ్చిన భరోసాతో పెద్దలింగాపూర్ సహా 12 గ్రామాల రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్, వుమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గీస మధు, బిక్షపతి తదితరులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.




