9 April, 2026 | 1:13 PM

ట్యాంకర్ పేలి వ్యక్తి మృతి

09-04-2026 11:13 AM

 ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా ఘటన 

 సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా  చౌరస్తాలో జరిగిన ఘటన..

మునిపల్లి: ఓ ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తుండగా  ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలింది . ఈ ఘటనలో వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి  స్థానికులు , ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్ కె పల్లి గ్రామానికి చెందిన ఫరీద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో వెల్డింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే బుధవారం ఓ ట్యాంకర్ కు వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలింది. దీంతో వెల్డింగ్ చేస్తున్న ఫరీద్ (32) కు తీవ్ర గాయాలు కావడంతో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించగా.. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి  వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా టాంకర్ పేలడంతో  చుట్టుపక్కల భారీ శబ్దం రావడంతో సమీపాన ఉన్న జనం పరుగులు తీశారు.

ట్యాంకర్ మొత్తం భాగాలుగా విడిపోయి చిందరవందరగా చుట్టుపక్కల  ఎగసి పడ్డప్పటికీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రోడ్డుపై వెళ్తున్న ఓ కారు, లారీకి తాకి అద్దాలు ధ్వంసమైనట్టు  స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్  తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.