6 April, 2026 | 4:53 AM

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

06-04-2026 02:51 AM

జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

కరీంనగర్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధాని గా దేశానికి 30 ఏళ్లు సేవలందించిన జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మహనీయుల మాదిరి మనం కూడా ఉన్నతంగా ఆలోచించి గొప్ప పనులు చేయాలని సూచించారు. ఇండో పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని కరువు నుంచి కాపాడిన మహనీయుడని జగ్జీవన్ రాము ను కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన లోనూ జగ్జీవన్ రామ్ కుమార్తె అప్పటి లోక్ సభ స్పీకర్ కీలక పాత్ర పోషించి బిల్లు పాస్ చేయించారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. దళితులకు ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూములు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ వర్గీకరణ జరిగిందని.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించడంతో నేడు అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదివి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సమానత్వం కోసం ఎంతో కృషి చేశాడని వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ, పరిహారం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నా రు. కులాంతర వివాహాలు చేసుకున్న పలువురికి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

.సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన బాబూ జగ్జీవన్ రామ్: - కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, భారత రాజకీయ చరిత్రలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు, దళిత జాతి రత్నం బాబూ జగ్జీవన్ రామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కేంద్రంలో 29 ఏళ్లపాటు మంత్రిగా కొనసాగిన బాబూ జగ్జీవన్ రామ్ దేశ సేవే పరమ ధర్మంగా భావించి ఆచరించి చూపారని తెలిపారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుండి కుల వివక్షను ఎదుర్కొని పోరాడిన నాయకుడు జగ్జీవన్ రాం అని, అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని చివరిదాక అంకితం చేసిన నాయకుడన్నారు. కష్టాలను జయించి ఎదగాలని,బి సమాజంలోని బలహీన వర్గాల కోసం నిలబడాలని, దేశ సేవే మన పరమ ధర్మం అనే మూడు నినాదాలను పుణికి పుచ్చుకుని జీవితాంతం వాటి కోసం పాటుపడిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.