షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన పూనెం నాగరాజు–నాగలక్ష్మి దంపతుల ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న టీవీ, కూలర్, ఫ్రిజ్, బట్టలు, బియ్యం, పిల్లల పుస్తకాలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంది. అలాగే దాతలు కూడా తమ కుటుంబానికి తోచినంత సహాయం అందించాలని నాగరాజు–నాగలక్ష్మి దంపతులు విజ్ఞప్తి చేశారు.






