23 June, 2026 | 5:05 AM

పోడు రైతులకు న్యాయం చేయాలి

23-06-2026 01:40 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డా. సి. సువర్ణను కోరారు. సోమవారం హైదరాబాద్లోని ఫారెస్ట్ భవన్లో రైతులతో కలిసి ఆమె డా. సి. సువర్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ఆయా మండలాలకు చెందిన వందలాది కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం కాగా, ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబాలన్నీ పూర్తిగా సాగుపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.అటవీ శాఖ చర్యల కారణంగా రైతులు సాగు చేస్తున్న భూములను కోల్పోతే వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం చేయాలని పీసీసీఎఫ్ను కోరారు.ఇప్పటికే ఖరీఫ్ సీజన్కు రైతులు విత్తనాలు వేసి సాగు ప్రారంభించారని, ఈ సమయంలో అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.