28 August, 2026 | 10:54 AM

ఆర్.కె. పురం ఆఫీసర్స్ కాలనీ 22-ఏ సమస్యను తక్షణమే పరిష్కరించాలి

27-08-2026 11:39 PM

8,000 మంది ఓటర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి 

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

మల్కాజిగిరి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 22-ఏ సమస్యను పరిష్కరిం చాలని, లేకపోతే వచ్చే నెల 6, 7 తేదీలలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకువస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్. కె. పురం ఆఫీసర్స్ కాలనీని 22-ఏ ప్రొహిబిషన్ లిస్టులో చేర్చడం వల్ల తీవ్రంగా ప్రభావితమైన కాలనీవాసుల సమస్యను పరిష్కరించేందుకు గురువారం బీజేపీ నాయకుడు  గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కాలనీవాసుల సమస్యలను స్వయంగా విని, వారికి పూర్తి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే వరకు, 22-ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ పోరాటం ఆగదు అని ఆయన తేల్చి చెప్పారు. 22-Aలో నాలుగు సర్వే నంబర్లు – వేలాది కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.ఆర్.కె. పురం ఆఫీసర్స్ కాలనీకి సంబంధించిన సర్వే నంబర్లు 195/1, 196/1, 207, 208 ప్రస్తుతం 22-A ప్రొహిబిషన్ లిస్టులో ఉండటం వల్ల ఆ సర్వే నంబర్ల పరిధిలోని ఫ్లాట్ ఓనర్లు, అపార్ట్‌మెంట్ సుమారు 8,000 మంది ఓటర్లు ఉన్న ఈ కాలనీ మొత్తం ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమ వుతోందన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరిం చాల్సిన ప్రభుత్వం ప్రజల్లో ఆందోళన కలిగించే పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలను భయపెట్టడానికి కాదు… ప్రజలకు భరోసా కల్పించడానికి ఉండాలి. అధికారులు తప్పు చేశారని చెప్పి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దాలి. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కానీ అధికారుల తప్పులకు అమాయక ప్రజలను బాధ్యులను చేయడం మాత్రం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు.  సీఎం, రెవెన్యూ మంత్రి, కలెక్టర్లు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఈ సమస్యను  పరిష్కరిం చాలని ఆయన ప్రభుత్వా న్ని కోరారు. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల పక్షాన పోరాడుతానని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

1968 నుంచి ఉన్న కాలనీకి ఇప్పుడు ఈ సమస్య ఎందుకు..?

కాలనీవాసులు మాట్లాడుతూ, ఆర్.కె. పురం ఆఫీసర్స్ కాలనీ సుమారు 1968లో ఏర్పడిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు దశాబ్దాలుగా వేలాది కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఇన్ని సంవత్స రాలుగా ఎటువంటి సమస్య లేకుండా కొనసాగి న ఆస్తులను ఇప్పుడు 22-ఏ ప్రొహిబిషన్ లిస్టులో చేర్చడం వల్ల తమ జీవితకాల సంపాదన, పిల్లల భవిష్యత్తు, ఆస్తులపై హక్కుల విషయంలో తీవ్ర ఆందోళన నెలకొన్నదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే సీరియస్‌గా తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, ఆర్.కె. శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, సునీత, ప్రసన్న, ఆదిత్య, కాలనీ అధ్యక్షులు మహాపాత్ర తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే కర్నల్ మక్కర్ సింగ్, తారా, గిరి రాజు, రమేష్ యాదవ్, బసిరెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు