calender_icon.png 23 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలేరు ఏటిలో ఇసుక మాఫియా?

23-02-2026 12:00:00 AM

  1. తెల్లవారుజామున అక్రమ రవాణా
  2. జక్కేపల్లి పరిసరాల ప్రాంతాల నుంచి భారీగా ఇసుక తరలింపు
  3. ప్రభుత్వ పథకాలకు.. జీళ్లచెరువు రోడ్లకు అంటూ ప్రచారం..
  4. ప్రైవేట్ పనులకు తరలిస్తున్న ఇసుక వ్యాపారులు
  5. ట్రక్కుకు రూ.5వేల నుంచి 6వేల వరకు వసూళ్లు..
  6. ప్రభుత్వ పథకాలనీ పట్టించుకోని అధికారులు

కూసుమంచి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): పాలేరు ఏటిలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిళ్లుతుంది.. ప్రభుత్వ పథకాలకు ఇసుకను సరఫరా చేస్తున్నామని అక్రమార్కులు అబద్దాలు చెబుతూ అధికారులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. వందల ట్రక్కుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.. తెల్లవారుజామున.. పట్టపగలు.. ఇష్టానుసారంగా యద్దేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులకు ఎవరైనా సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలకేగా అన్నట్లుగా లైట్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద చెరువు పాలేరు జలాశయం.. ఈ జలాశయం అలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా వరకు పాలేరు ఏరు ప్రవహిస్తుంది. ఈ ఏడాది అధిక వర్షాలు రావడం, భారీ వరదలతో పాలేరు ఏటిలో ఇసుక మేటలేత్తింది. దీంతో కొందరు ఇసుక వ్యాపారులు, కొందరు రైతులు, కొందరు స్థానికులు ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఏటిలో ఇసుకను తరలించాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా గత కొన్ని నెలల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. 

ఇందిరమ్మ ఇండ్ల రావడంతో

తెలంగాణ ప్రభుత్వం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. పాలేరు నియోజకవర్గానికి 4,500కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, ఊరికి సుమారు 20 నుంచి 50 ఇండ్ల వరకు మంజూరైయ్యాయి. దీంతో ఆ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అవసరం వచ్చింది.. కాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ పథకాలకు ఇసుకను తరలించేందుకు మౌఖికంగా అనుమతులు ఇచ్చింది.  దీంతో ఇసుకాసురులు అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

ట్రాక్టర్ల ద్వారా గ్రామాలకు తరలిస్తున్నారు.  కొంత మంది వ్యవసాయ భూముల్లో, ఏటికి సమీపంలో, గ్రామాల్లో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకున్నారు. జక్కేపల్లి, తుమ్మలతండా, గోరిలపాడుతండా, రాజుపేట బజార్, రాజుపేట, భగత్ వీడుతండా, నాయకన్గూడెం, మల్లాయిగూడెం తదితర గ్రామాల్లోని సమీప ఏటీ ప్రాంతంలో కొందరు వ్యాపారులు, ట్రాక్టర్ల యజమానులు ఇసుకను డంప్ చేసుకున్నారు.

ఆ ఇసుకను అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ట్రక్కు 2500 నుంచి 3500 ధర పలికేది. కానీ ఇందిరమ్మ ఇండ్ల రావడంతో ఇసుక రవాణా చేసే వారు సిండికేట్ అయ్యి ఒక ట్రాక్టర్ ట్రక్కు రూ.5,500 నుంచి 7,000 వరకు వసూల్ చేస్తున్నారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేనప్పటికి ప్రభుత్వ సూచనలతో రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఇసుక రవాణాను వదిలేశారు. 

ప్రభుత్వ పథకానికి అంటూ..?

గత రెండు నెలల వరకు ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లకు అంటూ ఇసుకాసురులు ఇష్టానుసారంగా బహిరంగంగానే ఇసుకను  పాలేరు ఏటి నుంచి భారీగా తరలించారు. కానీ ప్రస్తుతం నెల రోజుల నుంచి కూసుమంచి మండలంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వర్కులు జరగడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే అన్ని ఇండ్లు నిర్మాణాలు పూర్తుయ్యాయి.

కానీ ఇసుక అక్రమ రవాణా చేసే కొందరు వ్యక్తులు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల పేర్లు చెబుతూ ప్రభుత్వ పనులకు అంటూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుకను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలోని సీసీ రోడ్లకు, ఈ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లకు అంటూ బుకాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. 

జీళ్ళచెరువు పేరు చెబుతూ..

కూసుమంచి మండలంలోని గోరిలపాడుతండా, తుమ్మలతండా, జక్కేపల్లి తదితర గ్రామాల్లో ఉన్న పాలేరు ఏటి నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు. అధికారులు, గ్రామస్థులు అడిగితే జీళ్ళచెరువులోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంకు రోడ్డు, జీళ్ళచెరువులో సీసీ రోడ్లు వేస్తున్నారు.. అక్కడికి ఇసుకను పంపిస్తున్నామని అధికారులకు,

గ్రామస్థులకు ఇసుకాసురులు తప్పుడు సమాచారం అందించి అక్కడ నుంచి భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో అధికారులు, గ్రామస్థులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ జీళ్ళచెరువులో సీసీ రోడ్లకు పైనంపల్లి 20 ట్రక్కుల ఇసుకను ఉపయోగించడం జరిగింది. 

అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం రోడ్డుకు సీసీ రోడ్డు పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ ఇసుకాసారులు స్వామివారి పేరును వాడుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇతర గ్రామాల్లో బిల్డర్లకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో మంజూరయ్యే ఇందిరమ్మ ఇళ్లకు అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.