3 July, 2026 | 2:17 AM

10 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులు

03-07-2026 12:00 AM
  1.   17 వ్యూహాత్మక రంగాల్లో 120కి పైగా ఒప్పందాలు
  2. జపాన్ ప్రధాని సనాయే తకైచి నా చెల్లెలు 
  3. ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైంది
  4. ఇండో ఉమ్మడి అభివృద్ధే మా లక్ష్యం
  5. తొలిసారిగా రక్షణ ప్రాజెక్టుపై సంతకాలు
  6. భారత్--జపాన్ బయోగ్యాస్ కార్యక్రమం ప్రారంభం
  7. ప్రధాని నరేంద్ర మోదీ
  8. భారత్ వృద్ధిని పరుగెత్తిస్తున్న మోదీ : సనాయే తకైచి 

న్యూఢిల్లీ, జూలై 2: ఇండియా--జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఈ మేరకు రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల (దాదాపు రూ.6 లక్షల కోట్ల) పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక, ఇంధన భద్రతపై ఉమ్మడి కార్యాచరణను ఇరుదేశాలు సిద్ధం చేశాయన్నారు. తొలిసారిగా రక్షణ సహ- అభివృద్ధి ఒప్పందం ప్రాజె క్టు ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణమే భారత్, జపాన్ ఉమ్మడి లక్ష్యమన్నారు. భారత్--జపాన్ బయోగ్యాస్ కార్యక్రమం ప్రారంభిస్తు న్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో జపాన్‌తో 17 వ్యూహాత్మక రంగాల్లో 120కి పైగా ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని సనాయే తకైచి ‘నా చెల్లెలు’ అని మోదీ చెప్పారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని సనాయె తకాచి ఇండియాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా గురువారం ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అక్కడి హైదరాబాద్ భవన్‌లో 16వ వార్షిక భారత్- శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచితో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తకైచిని తన ‘చెల్లెలు‘గా అభివర్ణించిన మోదీ, ఆమె భారత పర్యటనతో ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు.

జపాన్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకురాలిగా, దూరదృష్టి కలిగిన ప్రధానమంత్రిగా తకైచిని మోదీ ప్రశంసించారు. స్వేచ్ఛాయుత, అందరికీ అందుబాటులో ఉండే, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణమైన ఇండో ప్రాంత నిర్మాణమే భారత్, జపాన్ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు. సాంకేతిక రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలకు కీలక స్తంభంగా మారిందని చెప్పారు. భారత్, జపాన్ తొలిసారిగా రక్షణ రంగంలో సహ- అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయని చెప్పారు.

ఇరు దేశాలు కలిసి రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయనున్నాయని మోదీ వెల్లడించా రు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ శాంతి, సముద్ర భద్రతతో పాటు అంతర్జాతీయ నిబంధనల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇండో ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌లో జపాన్ కంపెనీల సంఖ్య రెట్టింపు

ఆర్థిక రంగంలోనూ భారత్--జపాన్ భాగస్వామ్యం మరింత బలపడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. గత ఏడాదిలో ఇరు దేశాల మధ్య 120 కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ల జపాన్ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

దీంతో భారత్‌లో జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడం ‘మా లక్ష్యం స్పష్టం’ అని అన్నారు. తయారీ, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయని వివరించారు. నౌకా నిర్మాణం, విమానయానం, లాజిస్టిక్స్‌లో సహకారానికి అవసరమైన చట్రాన్ని సులభతరం చేయడానికి ఇరుపక్షాలు ఒక మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఖరారు చేశాయి.

చైనా సైనిక బలప్రదర్శన పెరుగుతున్న ఇం డో-పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితిపై కూడా మోదీ, తకైచి చర్చించారు. అంతేకాకుండా, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తి రంగాలలో మా సహకారం ప్రపంచ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు కీలకమైన తోడ్పాటును అందిస్తుందని మోదీ అన్నారు.  

ఆర్థిక, ఇంధన భద్రతపై ఉమ్మడి ప్రణాళిక

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాలు ఆర్థిక భద్రత, ఇంధన భద్రతకు సం బంధించిన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాయని మోదీ తెలిపారు. ముఖ్యంగా సెమీకండక్టర్లు, క్వాంటమ్ సాంకేతికత వంటి కీలక రంగాల్లో సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

వృద్ధిని పరుగెత్తిస్తున్న మోదీ: తకైచి 

జపాన్ ప్రధాని, పెట్టుబడులు, ఆవిష్కరణల సహకారం ద్వారా ఇరుపక్షాలు ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తున్నాయని పాన్ ప్రధాని సనాయే తకైచి తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే జాతీయ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’ను ప్రధాని మోదీ ప్రారంభించి, భారతదేశ వృద్ధిని పరుగెత్తిస్తున్నారని జపాన్ ప్రధాని అన్నారు.