అక్రమంగా షెడ్డు, షెటర్స్ నిర్మాణం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
కుత్బుల్లాపూర్, జులై 23(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఎలా నిర్మిస్తే మాకేంటి అడ్డు అనేలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్రమ షెడ్డు, షెటర్లు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఅవుట్ డివిజన్ రెడ్డి అవెన్యూ కాలనీలో ఓ నిర్మాణదారుడు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు, షెటర్స్ నిర్మాణం చేపట్టాడు.అక్రమ కట్టడాలు యదేచ్చగా జరుగుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కాకతీయ హిల్స్ లోని అక్రమంగా షెటర్ నిర్మాణం
ప్రగతి నగర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ లోని ఓ నిర్మాణదారుడు అక్రమంగా షెటర్ నిర్మాణం చేపట్టాడు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అక్రమంగా షెటర్ నిర్మాణం చేపడుతూ స్థానికులను, అందులో నివాసం ఉంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందినప్పుడు సెటిల్మెంట్ కొరకే నోటీసులు జారీ చేస్తారని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు అధికారులకు ఒప్పందం కుదిరిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడరని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రోత్సాహించడం తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.అధికారులకు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందినప్పుడు ఏదో అలా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకొని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






