22 June, 2026 | 9:52 PM

పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి

22-06-2026 07:56 PM

- సీపీఐ అనుబంధ తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

బూర్గంపాడు,(విజయక్రాంతి): అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దపు సుబ్బారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, అలవాల సీతారామిరెడ్డిలు మాట్లాడుతూ... కేంద్రం పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్రమే వహించాలని డిమాండ్ చేశారు.

యూరియా యాప్ను రద్దుచేసి రైతుభరోసా మొత్తంగా ఒకే దఫాలో జూన్ 30లోగా రైతుల ఖాతాల్లో జమచేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి పంటల ఖర్చుకు ఉపయోగపడేలా అమలుచేయాలన్నారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని, పంటల రుణమాఫీ రూ.2లక్షలకు పైగా చేయాలని, పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలుచేయాలని, రైతులు పండించే ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, గ్రామాల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించి ఏ విత్తనాలు వేయాలి... ఏ సమయంలో ఏ పంట వేయాలో పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్కు నాయకులు అందజేశారు.