25 March, 2026 | 1:47 AM

రైతు ఖాతాలోకి భరోసా నిధులు

25-03-2026 12:00 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 431 కోట్లు జమ

7,19,500 ఎకరాల యాసంగి సాగు పెట్టుబడి సాయం

ఏప్రిల్లో మిగతా రైతులకు చెల్లింపులు

సంగారెడ్డి, మార్చి 24(విజయక్రాంతి): ఉగాది పండగ తర్వాత మళ్ళీ పండగ వాతావరణం నెలకొంది. రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఎకరానికి రూ.6వేల చొప్పున అకౌంట్లలో జమ అవుతున్నాయి. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరిస్తోంది. ఎకరానికి ఏడాదికి రూ.12వేల చొప్పేన ఇస్తున్న ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి తొలివిడతలో ఎకరానికి రూ.6వేలు రైతుల ఖాతాలో జమ చేస్తోంది. మూడు విడతలుగా ఏప్రిల్ మాసాంతం వరకు మిగతా రైతులకు భరో సా నిధులు జమ కానున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ప్రకటించిన విధంగా యాసింగి సాగు కోసం రైతులకు భరోసా నిధులను విడుదల చేశా రు. ఈ మేరకు సోమవారం నాడు ఎకరం చొప్పున రూ.6వేలు బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. తొలివిడతలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 7,19,500 మంది రైతులకు రూ.431.17 కోట్లు వారి ఖాతాల్లో పడ్డాయి. దీంతో యాసంగి సాగు కోసం రై తులకు పెట్టుబడి సాయం అందించినట్లయింది. అయితే మిగతా రైతులకు సైతం రెండో విడత కింద మూడెకరాలు ఉన్న రైతులకు, మూడో వి డత కింద అందరికి పెట్టుబడి సాయం అందనుంది. 

ఉమ్మడి జిల్లాలో ఇలా...

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9,33 046 మంది రైతులకు గాను 7,19,500 మంది రైతులకు తొలి విడతగా రూ.431.17 కోట్లు వారి ఖాతాలో జమ అయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 3,18,877 మంది రైతులకు చెందిన 2,55,739 ఎకరాలకు రూ.153, 44,32,836 చెల్లింపులు జరిగాయి. మెదక్ జిల్లాలో 2,60,818 మంది రైతులకు చెందిన 1,84,080 ఎకరాలకు రూ.110,33,83,608 చెల్లించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 3,53,351 మంది రైతులకు చెందిన 2,79, 681 ఎకరాలకు గాను రూ.167, 80,87, 158 ఖాతాల్లో చెల్లింపులు జరిగాయని అధికారులు చెప్పారు. 

మొదట ఎకరం భూమికే...

తొలి విడతలో భాగంగా ఎన్ని ఎకరాల భూమి ఉన్నాప్రతి రైతుకు ఎకరం భూమికి సంబంధించి రైతు భరోసా నిధులు అందజేశారు. మరో 20 రోజుల్లో 3 ఎకరాల వరకు, ఏప్రిల్లో అందరికీ రైతు భరోసాను అందజేయనున్నారు. యాసంగి సాగు కో సం రైతు భరోసా డబ్బులు ఎంతో ఉపయోగపడనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.