ఫ్రీ సీటు.. ఫీజులో రాయితీ!
- గ్రామీణ విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలల గాలం
- పది పాసైన వాళ్లే టార్గెట్
- నమ్మించి రూ.లక్షలు దండుకుంటున్న వైనం
కంగ్టి, మే 29 : ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఆఫర్లు, రాయితీల పేరిట మభ్యపెడుతున్నాయి. పదో తరగతి పాసైన గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని వారి ఏజెంట్లను పంపుతున్నాయి. బహుమతులు, అడ్వా న్స్లు అందజేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తీరా అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్లు చెప్పే వివిధ ఫీజుల వివరాలు తల్లిదండ్రులను షాక్ కు గురి చేస్తున్నాయి.
గ్రామాల బాటలో ఏజెంట్లు...
ఫ్రీ సీటు, హాస్టల్, ఫీజులో రాయితీ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నారు. మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రయివేటు కళాశాలలతో పాటు హైదరాబాద్ లోని కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు స్థానికంగా అద్దె గదుల్లో నివాసముంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వల విసురుతున్నారు. మరి కొన్ని కళాశాలల యాజమాన్యాలు టెలీకాలర్లను నియమించుకొని తల్లిదండ్రులకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేయిస్తూ మభ్యపెడుతున్నాయి.
పదో తరగతి ఫలితాలు రాగానే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు మార్కుల జాబితాలతో గ్రామాల్లో 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మీ అబ్బాయి చాలా తెలివైనోడు, మా కాలేజీలో ఫ్రీ సీటు.. ఫీజులో రాయితీ అంటూ నమ్మబలుకుతున్నారు. గిఫ్ట్ లు ఇచ్చి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అయితే ఒకసారి ఆడ్మిషన్ తీసుకున్నాక ఆసలు కథ మొదలవుతోంది. ట్యూషన్ ఫీజు ఫ్రీ, కానీ బిల్డింగ్ ఫండ్, స్పెషల్ కోచింగ్, మెటీరియల్, యూనిఫాం పేరుతో ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం అడ్మిషన్ల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయడం నేరం. కానీ కార్పొరేట్ కాలేజీలు యాజమాన్య కోటా పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ. లక్షలు దండుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏ కాలేజీ ఏజెంట్ కూ అడ్వాన్స్ ఫీజు డబ్బులు, పదో తరగతి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, ఫ్రీ అని చెబితే రాతపూర్వకంగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.






