మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
485 మందికి వైద్య సేవలు.. ఉచిత మందులు పంపిణీ
అత్వెల్లి: మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని అత్వెల్లి గ్రామంలో ఆదివారం భారీ ఉచిత ఆరోగ్య, దంత, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అల్-హష్మీ హెల్త్ సెంటర్, తంజీమ్ గులామానే గౌసే ఆజం సంయుక్త ఆధ్వర్యంలో, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిరంలో మొత్తం 485 మంది వైద్య సేవలు పొందారు.
వీరిలో సాధారణ వైద్యం కోసం 257 మంది, కంటి వైద్యం కోసం 134 మంది, దంత వైద్యం కోసం 94 మంది హాజరయ్యారు. అవసరమైన 22 మందికి ఉచితంగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. మెరుగైన చికిత్స అవసరమైన 10 మందిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు.అల్-హష్మీ హెల్త్ సెంటర్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు డాక్టర్ ఎం.డి. బషీరుద్దీన్ ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించారు.
డాక్టర్ హసీబ్, డాక్టర్ ఫర్హాన్, డాక్టర్ జువేరియా ఫిర్దౌస్, డాక్టర్ ఉజ్మా అఫ్రీన్, డాక్టర్ ఇఫ్రా సమ్రీన్, డాక్టర్ అబ్దుల్ ముఖీత్ తదితర వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, మందులు అందించారు. మిలాద్-ఉన్-నబీ స్ఫూర్తితో మానవ సేవే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ బషీరుద్దీన్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించిన నిర్వాహకులను అత్వెల్లి, దబిల్ పూర్, కలాకల్, మనోరాబాద్, దండుపల్లి,గ్రామస్తులు అభినందించారు.






