06-02-2026 12:54:24 AM
కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా రగిలాయి. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రంతో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది. చొప్పదండి నియోజకవర్గ పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఫొటో లేకపోవడం వివాదానికి దారి తీసిం ది.
ఇది సాధారణ పొరపాటు కాదని, కావాలనే తమ నాయకుడిని రాజకీయంగా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందని సత్యం అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణను పట్టించుకో కుండా నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్‌రావు వర్గీయులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో పలువురు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, తాజా ఘటనతో వర్గ విభేదాలు మరింత బహిర్గతమయ్యా యి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఐక్యత అవసరమైన సమ యంలో నేతలు పరస్పరం రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవస రం ఉన్నప్పటికీ, వ్యక్తిగత రాజకీయ అజెండాలతో ముందుకు సాగడం వల్ల పార్టీ ప్రతి ష్ఠ దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని వర్గపోరుకు చెక్ పెట్టకపోతే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశ ముందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు, ఈ వివాదం కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.