24 July, 2026 | 11:07 AM

పోచన్నపేటలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామ రైతులు

24-07-2026 09:44 AM

అనుమతులు గోరంత తవ్వేది వాగు అంత

బచ్చన్నపేట: జులై 23 విజయక్రాంతి:  మండల పరిధిలోని పోచన్నపేట గ్రామంలో ఇసుక మాఫియా రవాణాపై గురువారం భారీ ఉద్రిక్తత నెలకొంది. ఆన్‌లైన్ స్లాట్స్ బుకింగ్ పేరుతో పెద్దవాగు నుంచి ఇసుకను తరలించడానికి వచ్చిన అన్ని  ట్రాక్టర్లను గ్రామ రైతులు, స్థానికులు తీవ్ర ఆగ్రహంతో అడ్డుకుని వెనక్కి పంపించారు. పోచన్నపేట పెద్దవాగు నుండి నిరంతరాయంగా ఇసుకను తోడేయడం వల్ల గ్రామంలో భూగర్భ జలమట్టం పడిపోతోందని, వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.  ప్రభుత్వ పనులు  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తక్కువ సంఖ్యలో పర్మిట్లు తీసుకుని, వాటి మాటున కమర్షియల్ అవసరాలకు వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని రైతులు.ధ్వజమెత్తారు ఉదయాన్నే వాగులోకి వరుసగా వచ్చిన ట్రాక్టర్లను చూసి ఆగ్రహించిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. స్లాట్స్ బుక్ చేసుకున్నామంటూ వచ్చిన డ్రైవర్లతో వాగ్వాదానికి దిగి, ఒక్క ట్రాక్టర్‌ను కూడా ఇసుక తీసుకెళ్లనివ్వకుండా అన్నింటినీ వెనక్కి పంపించేశారు.

ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ కిందనే భారీ గోతులు తవ్వి, కోట్ల నిధులతో చేపట్టిన డ్యామ్ ల ను కూలిపోయే విధంగా ఇసుకను తోడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చెక్ డ్యామ్ పునాదులు బలహీనపడి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. ఇసుక  దళారులు అడ్డుకున్న వాగు పక్క గల  రైతులపై దాడులు చేసినట్లు, ఇసుక దళారులు ఆన్‌లైన్ స్లాట్ల అనుమతుల పేరిట చేస్తున్న ఈ దోపిడీపై రెవెన్యూ, మైనింగ్ పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పోచన్నపేట పెద్దవాగు నుండి ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, ఆత్మహత్యలకు వెనుకాడ బోమని గ్రామ రైతులు హెచ్చరించారు...