3 April, 2026 | 3:58 PM

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు

03-04-2026 01:52 PM

*  25 రోజులుగా తాగునీటి కష్టాలు!

​ఆమనగల్లు, ఏప్రిల్ 3(విజయక్రాంతి): మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్థానికులకు శాపంగా మారింది. పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో అండర్ డ్రైనేజీ మరమ్మతుల కోసం చేపట్టిన తవ్వకాలు చివరకు తాగునీటి సరఫరా నిలిచిపోయేలా చేశాయి.​గత 25 రోజుల క్రితం 1వ వార్డులో డ్రైనేజీ మరమ్మతుల కోసం జెసిబితో గుంతలు తవ్వారు. ఈ క్రమంలో భూగర్భంలో ఉన్న తాగునీటి పైప్‌లైన్ తీవ్రంగా దెబ్బతిన్నది. అప్పటి నుండి వార్డుకు నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు.​ఈ సమస్యపై 1వ వార్డు సభ్యుడు కొప్పు జగన్ స్పందిస్తూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్‌లైన్ డ్యామేజ్ అయిన విషయాన్ని సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినప్పటికీ, వారు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.అభివృద్ధి పేరుతో పనులు మొదలుపెట్టి, ఉన్న సౌకర్యాలను కూడా దూరం చేయడం ఏంటని? 25 రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా స్పందించకపోవడం దారుణం అని 

 వార్డు సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ​పనులు సగంలోనే ఆగిపోవడంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని, పైగా నీటి సరఫరా లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి చేసి తాగునీటిని పునరుద్ధరించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.