విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలి : డీఈవో డి. వాసంతి
బూర్గంపాడు,(విజయక్రాంతి): విద్యార్థులకు చక్కటి బోధనతోపాటు, వారు వందశాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఈవో డి. వాసంతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల యొక్క హాజరును ఫేస్ రికగ్నిషన్ యాప్ లో పరిశీలించి, నలుగురు ఉపాధ్యాయులు గైర్హాజరవ్వడం గమనించి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. కొత్త అడ్మిషన్లు పరిశీలించి ఎన్రోల్మెంట్ ను ఇంకా పెంచాలని సూచించారు.
వంట సామాగ్రి, సరుకులు, వంటగది టాయిలెట్స్ ను పరిశీలించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించి వారి సామర్ధ్యలను పరిశీలించి, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా మొదలగు వాటిని ఉపయోగించుకుంటూ విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ఎటి పరిస్థిలో ఎవరూ కూడా పాఠశాలకు గైర్హాజరు అవ్వద్దని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






