25 March, 2026 | 1:49 AM

బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్లు?

25-03-2026 12:00 AM
  1. దారి తప్పుతున్న సబ్సిడీ సిలిండర్లు..
  2. కొరత సాకుతో అధిక దోపిడీ.. దందాలకు వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్లు..
  3. ఒక్కో సిలిండర్ 2500 నుండి 3000 వరకు డిమాండ్ 
  4. రహస్యంగా సిలిండర్ల అక్రమ సరఫరా...
  5. తాజాగా బాన్సువాడలో గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న పోలీసులు..
  6. అక్రమ గ్యాస్ సరఫరాపై అధికారులు ఉక్కు పాదం మోపెనా..

బాన్సువాడ, మార్చి 24 (విజయ క్రాంతి): గ్యాస్ కొరత కారణంగా సిలిండర్లు దారి తప్పుతున్నాయి. వినియోగదారులకు అందించాల్సిన సబ్సిడీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముడుపోతున్నారు. సిలిండర్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు కొరత సాకులు చూపుతూ అట్టి సిలిండర్లను వ్యాపారస్తులకు చేర వేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్ ధర బ్లాకులో 2500 నుండి 3000 వరకు తీసుకుంటున్నారు.

వంటగ్యాస్ సిలిండర్ల కోసం సంబంధిత డీలర్ల వద్ద పడి కాపులు కాచిన సిలిండర్లు దొరకక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్ లకు వాడుతుండడంతో ప్రస్తుతం ఏర్పడ్డ కొరత కారణంగా అసలైన లబ్ధిదారులకు అందకుండా పోతుంది. గత 20 రోజుల నుండి సిలిండర్ల కోసం గ్యాస్ వినియోగదారులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు అనుడే తప్ప సిలిండర్లు అందించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల నుండి ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్న మెసేజ్ లు, ఓటీపీలు  రావడం తప్ప గ్యాస్ సిలిండర్ మాత్రం గడప దాటడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా బాన్సువాడ పట్టణంలో బ్లాక్లో గ్యాస్ సిలిండర్లను నమ్ముతున్న వ్యక్తులను లోడుతో వెళ్తున్న ఆటోను స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్లను వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కమర్షియల్ దందాలకు డొమెస్టిక్ సిలిండర్లు 

పట్టణాల్లో ఉండే హోటల్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొబైల్ భోజనశాలలు కమర్షియల్స్ సిలిండర్లను వాడుకోవాల్సి ఉండగా, సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారు. వ్యాపారాలలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగం పెరిగిపోవడం వల్ల ఇళ్లల్లో వినియోగదారులకు సిలిండర్ల సమస్య ఏర్పడుతుంది. ఇదివరకు స్టాక్ బాగానే ఉండటంతో సమస్య ఉత్పన్నం కాలేదు. కానీ ప్రస్తుతం కొరత సమస్య కారణంగా సిలిండర్ల లభ్యత కష్టసాధ్యంగా మారింది.

కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ,ఎల్లారెడ్డి, బిచ్కుంద,పిట్లం, నిజాంసాగర్, బీర్కూర్, నసురుల్లాబాద్, మదునూర్, పట్టణాలలో కమర్షియల్ వ్యాపారాలలో గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. రెండు రోజులకొకసారి వారికి సిలిండర్లను సరఫరా చేసే పనిలో కొందరు సప్లై దారులు పనిగా పెట్టుకున్నారు.

ఆర్డర్ చేసిన వెంటనే గంటపాటు సమయంలో సిలిండర్లను వారికి చేరవేస్తున్నారు. కమర్షియల్ దందాలో  డొమెస్టిక్ సిలిండర్లను వాడడం చట్టరీత్య నేరమైనప్పటికీ, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సిలిండర్ల సరఫరా ప్రక్రియ పక్కదారి పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు మొండి చేయి చూపుతూ, కమర్షియల్ వ్యాపారాలకు సరపరా చేస్తున్న తతంగంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేకపోతున్నారు.

అక్రమంగా తరలిస్తున్న సిలిండర్ల పట్టివేత...

పెట్రోలింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు జరుపుతున్నప్పుడు అక్కడక్కడ గ్యాస్ సిలిండర్ల అక్రమ సరఫరా బట్టబయలవుతోంది. దారి తప్పు తున్న సిలిండర్లను పోలీసులు పట్టుకున్న సంఘటనలు లేకపోలేదు. సబ్సిడీ సిలిండర్లను గ్యాస్ వినియోగదారులకు ఇవ్వకుండా అక్రమంగా తరలిస్తున్న సిలిండర్లను బాన్సువాడ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా బ్లాక్ లో గ్యాస్ సరఫరా పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.