26 March, 2026 | 7:37 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సమీక్షించి, నాణ్యతతో పూర్తి చేయాలి

26-03-2026 05:55 PM

జిల్లా కలెక్టర్ 

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతి, గ్రామ సంఘ భవనానికి భూమి పూజ.  అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ.  ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సమీక్షించి , నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గృహ ప్రవేశానికి పూర్తయిన లబ్ధిదారుల ఇళ్లను వచ్చేనెల 6వ తేదీన ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల మల్లవ్వ శివ, పెద్దోళ్ల చంద్రకళ, పెద్దవ్వ, కవితలు నిర్మించుకుంటున్న ఇళ్లను నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం, సంబంధిత అధికారులు పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

అదేవిధంగా గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం  అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి చిన్నారులతో ముచ్చటిస్తూ వారి ఆరోగ్యం, సంక్షేమంపై వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని ఎత్తుకొని ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు. అంగన్వాడి కేంద్రంలోని మెనూ ను పరిశీలించడం తో పాటు స్టోర్‌రూమ్‌ ను తనిఖీ చేసి సరుకుల నాణ్యతను పరిశీలించారు. అలాగే గుడ్ల బరువు, నాణ్యతను కూడా తనిఖీ చేసి, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరాన్ని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.    కలెక్టర్ వెంట  పిడి హౌసింగ్ విజయపాల్ రెడ్డి, అదనపు drdo విజయలక్ష్మి, సంబంధిత మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.                                           ..