11 March, 2026 | 4:49 PM

Breaking News

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •  

పేదల ఇళ్లపై కాంగ్రెస్ ఉక్కుపాదం

11-03-2026 12:40 AM
  1. వెలుగుమట్లలో కూల్చిన చోటే ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలి
  2. జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత
  3. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు
  4. జాగృతి కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్న కవిత

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పాలిట శాపంగా మారిందని, భూదాన్ భూములను లాక్కొని బడాబాబులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ఖమ్మం వెలుగుమట్లలో అర్ధరాత్రి పేదల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి ఖమ్మంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ఆమెను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

అయినా వెనక్కి తగ్గని ఆమె.. బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు. కూల్చిన చోటే పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు, అరెస్టయిన నేతలను విడుదల చేసేవరకు తన పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు. ఖమ్మం జడ్పీ సెంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి, ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు గంటలపాటు రాస్తారోకో చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని కవిత విమర్శించారు.

ఆమరణ దీక్షకు కూర్చున్న తమను మంగళవారం తెల్లవారుజామున ఏకంగా 600 మంది పోలీసులు వచ్చి అరెస్టు చేసి, టెర్రిస్టుల్లా తమను చూస్తు ఈడ్చుకుంటూ హైదరాబాద్‌కు తీసుకొచ్చారని మండిపడ్డారు. వెలుగుమట్లలో మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమిలో 30 ఎకరాల అసలు భూమి ఉందని చెప్పారు. పేదలు కష్టపడి కట్టుకున్న 750 ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లతో కూలగొట్టడం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థుల పుస్తకాలు, హాల్‌టికెట్లు శిథిలాల కింద ఉండిపోయాయని చెప్పారు.

ఆ భూములకు జీవో 58 కింద రెగ్యులరైజేషన్ కోసం బాధితులు దరఖాస్తు చేసుకున్నారని, పట్టాలు కూడా ఉన్నాయని, అలాంటి భూమిని ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన కూలీలను అంబేడ్కర్ భవన్లో ఉంచారని, ఆ పరిస్థితి చూస్తే ఓ పశువుల కొట్టంలోకి జనాలను తోలినట్లుగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస సౌకర్యాలు లేక పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయని, కనీసం భోజనం కూడా పెట్టకుండా దాతల మీద ఆధారపడేలా ప్రభుత్వం వదిలేసిందన్నారు. బాధిత శిబిరాన్ని కలెక్టర్ సందర్శించాలని కోరితే, అదేదో అప్రజాస్వామికం అన్నట్లు కలెక్టర్ పంతానికి పోయారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో పేదల ఇళ్లు కూల్చేస్తుంటే ఎందుకు కనిపించడం లేదని కవిత సూటిగా ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ వెంటనే ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, పేదల ఇళ్లు కూల్చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత నిలదీశారు. వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగడంతో, పేదలను గెంటివేసి ఆ స్థలాన్ని బడాబాబులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, ఈ రియల్ ఎస్టేట్ దందా వెనుక ఈ ముగ్గురు మంత్రుల హస్తం ఉందని భావించాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.