11 March, 2026 | 6:29 PM

ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ

11-03-2026 04:36 PM

వాంకిడి,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాయి అని, ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని అదనపు ఎస్పీ చిత్తరంజన్ సూచించారు. బుధవారం వాంకిడి మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాడ్స్, పెన్లు, వాటర్ బాటిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువును కష్టంగా కాకుండా ఇష్టంతో చదవాలని, ఏవైనా సందేహాలు ఉంటే తోటి స్నేహితులు, ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో భయం, ఒత్తిడికి లోనుకాకుండా ఏకాగ్రతతో చదివితే ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించగలరని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై దుర్గం మహేందర్, మండల విద్యాధికారి శివచరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు నారాయణమూర్తి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.