22 July, 2026 | 4:15 PM

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..

22-07-2026 03:40 PM

- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్

ఇల్లెందు,(విజయక్రాంతి): లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని బుగ్గవాగు బ్రిడ్జిపై కాంగ్రెస్ నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న యువతపై లాఠీచార్జ్ చేయడం, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. దేశ యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్, సొసైటీ చైర్మన్ మెట్ల రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు జీవీ భద్రం, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.