8 April, 2026 | 4:08 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్ర తనిఖీలు

08-04-2026 12:00 AM

అశ్వరావుపేటలో కలెక్టర్ అంకిత్ పర్యటన

అశ్వరావుపేట ఏప్రిల్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతిపాదిత యంగ్ ఇండియా  ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి వాటి నాణ్యతను సమీక్షించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించి, నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేస్తూ సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే చింతపండు, కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించి ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని ముందుగా పూర్తిగా పరిశీలించిన తర్వాతే అందించాలని 8,9,10 వ తరగతి విద్యార్థులను ఆహార పరిశీలనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయంపై సిబ్బందిని ప్రశ్నించారు.  అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఔట్ పేషెంట్ విభాగం, వార్డులు, రక్త పరీక్ష కేంద్రం, మందుల నిల్వ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  వైద్యశాఖ అధికారులు రోగులకు అందించే ఆహారం పై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.  కలెక్టర్ వెంట తహసీల్దార్ కిషోర్, ఎంపీడీవో అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఆర్‌ఎంఓ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు సంగీత, సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.