మానుకోటలో కలకలం
విజయవాడలో తుపాకీతో పట్టుబడ్డ యువకుడి స్వగ్రామం రామన్నగూడెం
మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నాటు తుపాకీతో పట్టుబడ్డ యువకుడు కనకం మురళి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూ డెం. ఏపీలో గంజాయి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలో పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమాన్ని అమలు చేశారు. బస్టాండు ఎదుట ఉన్న హోటల్ డార్మెటరీ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
హోటల్‌లో బస చేసిన మురళి బ్యాగును తనిఖీ చేస్తుండగా మురళి మరో సంచి నుంచి తుపాకీ తీసి పోలీసులపై గురిపెట్టి కాల్పులకు యత్నించగా, అది పేలలేదు. పోలీసులు అప్రమత్తం కాగా మురళి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు. తుపాకీతో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. తన గ్రామంలో మిత్రులతో గొ డవ ఏర్పడిందని, అందుకోసం బీహార్ నుండి రూ.25 వేలలకు తుపాకీ కొన్నట్టు మురళి చెప్పాడు.
ఈ సంఘటన నేపథ్యంలో రామన్నగూడెంలో నెల్లికుదురు పోలీసులు విచారణ చేపట్టగా, అతని తల్లి కొంతకాలం క్రితం చనిపోయిందని, తండ్రిని పట్టించుకోకుండా మురళి కొన్నేండ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడని, గ్రామానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో వెల్లడైనట్లు నెల్లికుదురు ఎస్ ఐ రమేష్ బాబు తెలిపారు.




