ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. అవసరాలకు అనుగుణంగా సర్వీసులు!
హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో(Hyderabad Core Urban Area) ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని అధికారులను ఆదేశించారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై(MMTS Services) శానసమండలి హాల్‌లో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా తీశారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉండటంతో అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఎంఎంటీఎస్(MMTS passengers) స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని వివరించారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతులు మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.




