మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందజేసిన నగర మేయర్ కొలగాని
ముకరంపుర, జూలై 19(విజయ క్రాంతి): కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధి, తాగునీటి భద్రత, రైతుల సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ వినతిపత్రాన్ని అందజేశారు.
జిల్లా సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ని కలిసి కరీంనగర్ నగరంతో పాటు నియోజకవర్గ ప్రజల అవసరాలను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి అదనంగా 2 టీఎంసీల నీటిని విడుదల చేసి ఎల్‌ఎండీని నింపేందుకు చర్యలు తీసుకోవాలని,అమృత్ 2.0 పథకం కింద నగరంలో చేపడుతున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని పేర్కొంటూ పనులను వేగవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో రైతులకు ఫసల్ బీమా యోజన ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి హామీ కింద మంజూరైన రూ.132 కోట్లలో ఇప్పటివరకు రూ.34 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మిగిలిన రూ.98 కోట్ల నిధులు విడుదల కాకపోవడంతో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, వరద నివారణ పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అభివృద్ధి పనులు నిధుల కొరత కారణంగా పెండింగ్లో ఉన్నాయని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల విలీనమైన 8 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అదనంగా రూ.200 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు.
ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్లైన్లు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు అవసరమని వివరించారు.వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి, మిగిలిన సీఎం అష్యూరెన్స్ నిధుల విడుదలతో పాటు అదనపు నిధుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు మేయర్ తెలిపారు.






