సంపులో పడి బాలుడు మృతి
మేడిపల్లి మే 16 (విజయక్రాంతి): సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఒంగోలు జిల్లా కందుకూర్ మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన జూపల్లి మహేందర్ కుటుంబంతో కలిసి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మహేష్(5) అనే కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద కూలి పనులు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో శుక్రవారం బాలుడు ఆటలాడుకుంటూ అక్కడే ఉన్న సంపుకు మూత లేకపోవడంతో అందులో పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ, సంపులో పడిన బాలుడు నీ గమనించి బయటకు తీశారు. మృతి చెందిన బాలుడునీ చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నిర్మాణ ప్రదేశంలో భద్రతా చర్యలు చేపట్టకుండా సంపును తెరిచి ఉంచడమే ప్రమాదానికి కారణమని, బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






