9 July, 2026 | 11:58 PM

మద్యం మత్తులో పోలీసులపై దాడి...

09-07-2026 05:38 PM

 నలుగురికి పై కేసు నమోదు 

ఉప్పల్ విజయక్రాంతి జులై 09: రోడ్డుపై మద్యం సేవిస్తూ వాహనదారులను పాదాచారులను ఇబ్బందులు గురిచేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి, ప్రభుత్వ ట్యాబ్‌ను ధ్వంసం చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు  సంఘటన ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....  సీతాఫల్‌మండి మసీదు సమీపంలో ఏడి డ్రిల్ ముగించుకుని ఈఎఫ్‌ఎల్‌యూ టీ-జంక్షన్ వైపు పెట్రోలింగ్ వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ వి. కృష్ణ, ఏఎస్ఐ వెంకట్ కుమార్, ఎస్‌పీఓ పి. మోహన్‌రెడ్డి ఎదురుగా ఉన్న మోడల్ హైస్కూల్ సమీపంలో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును గుర్తించారు.

కారులో, బయట మద్యం సేవిస్తున్న నలుగురిని ప్రశ్నించగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో పోలీస్ అధికారిక ట్యాబ్‌లో రికార్డు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ట్యాబ్‌ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ కృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు వచ్చిన ఏఎస్ఐ వెంకట్ కుమార్‌పై కూడా కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేసి, ముగ్గురు కారులో పరారయ్యారు. మరో వ్యక్తిని ఎస్‌పీఓ మోహన్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని యు. సాయికిరణ్ (26)గా గుర్తించగా, పరారైన వారిని విశాల్, ఓ. సాయికృష్ణ, ఓ. శ్రీకర్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్‌కు తొలుత ఆర్టీసీ ఆస్పత్రిలో, అనంతరం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 329/2026 కింద విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ తదితర నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.